Resume Writing Tips in Telugu

Resume Writing Tips in Telugu
Resume Writing Tips in Telugu

Resume Meaning in Telugu:

మీకు ఉద్యోగాన్ని సంపాదించిపెట్టడంలో రెస్యూమే ప్రధాన పాత్ర పోషిస్తుందనేది  మీకు తెలిసే ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత కలిగిన Resume ని ఏ విధంగా రూపొందించుకోవాలి, అలాగే Resume రాసేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లు, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలను ఈ ఆర్టికిల్ లో నేర్చుకుందాం.

అయితే ముందుగా మంచి Resume, చెడ్డ Resume ల మధ్య తేడా ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనలో చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే ఉద్యోగాల కోసం వేట మొదలు పెడతారు. ఈ సందర్భంగా వారికి Resume అవసరమవుతుంది. Resume విలువ తెలియనివాళ్లు ఇతరుల Resume ని ఉన్నది ఉన్నట్టుగా కాపీ (నకలు) చేసి దాంట్లో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మార్చేసి ఉపయోగించడం చేస్తారు. పాపం, వీరికి అసలు Resume ఒక్క ఉద్దేశం ఏంటో తెలియదు. ఇలా తెలియకపోవడం వల్ల వారికి చాలా నష్టం కూడా కలిగే అవకాశం ఉంది.

Resume అనేది మీలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు, (Strengths, Weaknesses) మీ క్వాలిఫికేషన్స్, మీ వ్యక్తిత్వం వీటన్నింటి గురించి చెప్పడానికి ఒక మంచి అవకాశంగా మనం భావించాలి. అంతే తప్ప కేవలం ఒక పేజీలో మీకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన అది Resume అవుతుందంటే అంతకుమించిన పొరపాటు ఇంకొకటి లేదు.

ఎక్కువమంది చేసే మరొక పొరపాటు ఏమిటంటే ఒక స్టాండర్డ్ Resume తయారు చేసుకుని, ఏ రకమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అదే Resume ని కాపీ చేసి మళ్ళీమళ్ళీ ఉపయోగిస్తూంటారు. ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక ప్రత్యేక skill set అవసరం ఉంటుంది. అంటే ఒక్కొక్క ఉద్యోగంలో కొన్ని కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయన్నమాట. దానికి తగ్గట్టుగా మీరు Resume లో అవసరమైన మార్పులు చేయకుండా ఉపయోగించడం వల్ల అంత పెద్ద ప్రయోజనమేమీ ఉండదు.

ఇందులో భాగంగా, ముందుగా ఇవ్వబడ్డ జాబ్ నోటిఫికేషన్ ను జాగ్రత్తగా పరిశీలించండి. వీలైతే నాలుగయిదుసార్లు చదివే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఆ నోటిఫికేషన్ లో ఇవ్వబడ్డ Words మరియు Phrases ని ఒకచోట నోట్ చేయండి. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ కీవర్డ్స్ తో పాటు వీటికి అనుబంధంగా ఉండే మరికొన్ని Words మరియు Phrases ని మీరు మీ Resume లో ఉపయోగించాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ లో ఇవ్వబడ్డ జాబ్ డిస్క్రిప్షన్ ని పలుమార్లు చదివి అందులో ఉన్నటువంటి లక్షణాలకి సంబంధించిన words, adjectives ని మీ Resume లో పొందుపరచాల్సి ఉంటుంది.

ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ లోగాని, జాబ్ డిస్క్రిప్షన్ లోగాని సమాచారం అంత వివరంగా లేనట్లయితే మీకు కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, కాస్త శ్రమించిన సరే, ఇట్లాంటి రకానికి చెందిన మరొక కంపెనీ యొక్క జాబ్ నోటిఫికేషన్ ని వెతికి పట్టుకుని, దానిలో ఉన్న కీవర్డ్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ గురించి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చిందనుకుందాం. దాంట్లో ఎక్కువగా వివరాలు లేకపోతే, అదే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి సంబంధించిన మరొక కంపెనీ యొక్క నోటిఫికేషన్ మీరు పట్టుకొని అక్కడున్న కీవర్డ్స్ ని ఉపయోగించుకోవడం ఒక పద్ధతి.

ఇక Resume రూపొందించిన తర్వాత దాంట్లోని స్పెల్లింగ్ పొరపాట్లు, గ్రామర్ కి సంబంధించిన పొరపాట్లను, తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక దశలో ఈ పనిని మీరే పూర్తిచేసి, ఆ తర్వాత మళ్ళీ మరొకరికి అప్పగించడం మంచిది. దీనివల్ల మీరు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సులభంగా బయటపడతాయి. ఈ పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.

పూర్తయిన మీ Resume ని, ఇదే రంగంలో అనుభవం కలిగిన ఎవరైనా ఒక వ్యక్తికి చూపించడం ద్వారా, అందులో ఇంకా ఏ రకమైన అంశాలు చేర్చవచ్చు? ఏ అంశాలను తొలగించవచ్చు? లాంటి సలహాలు పొందవచ్చు.

ఈమధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం ఒక్క పేజీ కలిగిన దానికంటే, రెండు పేజీలు ఉన్న Resume ల పట్ల HR లు ఆసక్తి చూపిస్తున్నారని తేలింది. ఇది కూడా గుర్తుంచుకోవడం మంచిది. అయితే ఈ రెండు పేజీల Resume రాయడం మంచిది అన్న సలహాను బలవంతంగా పాటించాల్సిన అవసరం లేదు. అంటే అనవసరమైన విషయాలు చొప్పించి రెండు పేజీలు రాసేబదులు అవసరమైన విషయాలతో ఒకే పేజీ Resume రాయడమే మంచిది.

చాలా మంది అభ్యర్థులు Resume రాయడాన్ని ఒక అసాధ్యమైన పనిగా భావిస్తారు. ఏ మాత్రం కూడా ఆసక్తి లేనట్టుగా, ‘ఎంత తొందరగా ముగించేస్తే అంత మంచిది’ అన్న పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. నిజానికి Resume రూపొందించడమనేది అంత కష్టతరమైన పని ఏమి కాదు. మీకు Online లో అనేక Resume templates, Sample resume లు అందుబాటులో ఉన్నాయి. రెండు లేదా మూడు టెంప్లేట్స్ పరిశీలించినట్లయితే దీనిపట్ల మీకొక అవగాహన వస్తుంది. దాని ప్రకారం ముందుకు వెళ్లవచ్చు.

Resume లో ఉపయోగించగలిగే కొన్ని Adjectives గురించి మీకు అవగాహన ఉండటం తప్పనిసరి. వాటిలో కొన్నింటిని వీలైతే ఒక లిస్టు లాగా నోట్ చేసుకుని పెట్టుకోవడం కూడా మంచిదే.

ప్రొఫెషనల్ ప్రొఫైల్ కలిగి ఉండే LinkedIn లాంటి సోషల్ మీడియా Platform పై మీ ప్రొఫైల్ రూపొందించుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీరొక ప్రొఫెషనల్ అన్న విషయం హెచ్ఆర్ లకు సులభంగా అర్థమవుతుంది.

అంతేకాకుండా మీరు ఏ రకమైన ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో, దానికి సంబంధించిన నైపుణ్యాలను చూపించే Portfolio లు Online లో గనక అందుబాటులో ఉంటే Resume లో వాటి URL Link తప్పనిసరిగా ఇవ్వండి. ఉదాహరణకి మీరు ఒక కంటెంట్ రైటర్ లేదా కాపీ రైటర్ జాబ్ కొరకు లేదా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నప్పుడు, మీకు ఇదివరకే ఒక Blog గాని, ఒక Website గాని ఉంటే, దాని Link ఇవ్వడం ద్వారా మీ వర్క్ ఎలా ఉందనేది వాళ్ళు నేరుగా పరిశీలించగలుగుతారు.

ముఖ్యంగా Resume లో ఒక విషయాన్ని క్లుప్తంగా ఒక్కముక్కలో చెప్పకుండా, దానిని కొంత వివరించి చెప్పడం కూడా మంచిదే. ఉదాహరణకు మీ Core competencies,  మీ Expertise వల్ల కంపెనీకి ఎలాంటి ప్రయోజనం జరగవచ్చు మొ//. మీరు ఇదివరకే ఒక సంస్థలో పనిచేసి ఉంటే మీ వల్ల ఆ సంస్థకు ఎలాంటి ప్రయోజనం కలిగిందో వీలైతే ఒకటి రెండు ఉదాహరణలతో సహా క్లుప్తంగా చెప్పవచ్చు. అనుకోకుండా వచ్చిన సమస్యలను మీరు ఏ విధంగా పరిష్కరించగలరో, గతంలోని ఒకటి రెండు ఉదాహరణలతో సంక్షిప్తంగా తెలుపవచ్చు. అలాగే ప్రస్తుతం  ట్రెండింగ్ లో ఉన్నటువంటి Communication skills. Soft skills, Inter personal skills, Technical skills ఇట్లాంటి వాటిని కూడా వీలైనంతమటుకు వివరంగా రాయడం మంచిది. ఉదాహరణకి సాఫ్ట్ స్కిల్ విషయానికి వస్తే కేవలం Soft skills అని ఒకేఒక్క పదం ఉపయోగించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. దాని బదులు దాదాపు రెండు వందల సంఖ్యలో ఉన్న Soft skills లో, మీలో ఏ రకమైన క్వాలిటీస్ ఉన్నాయో, ఒక 10 నుండి 15 వరకు లక్షణాలను రాయడం వల్ల HR కి మీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది.

సాధారణంగా ఇతరులెవ్వరికీ సాధ్యం కానటువంటి ఒక మంచి నైపుణ్యం, లక్షణం, అర్హత మీకున్నట్లయితే దానిని జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేయడం, ప్రముఖంగా చూపించడం చాలా అవసరం. ఉదాహరణకి మీకు ఒక విదేశీ భాషపై పట్టు ఉందని అనుకుందాం. ఇప్పుడు ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం కోసం అప్లై చేసేటప్పుడు, దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం అవసరం. అంతర్జాతీయంగా కమ్యూనికేషన్ కోసం, విదేశీ భాషలు వచ్చిన వారికి, కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇట్లాంటి ప్రత్యేకత గనుక మీ వద్ద ఉంటే తప్పకుండా వాటిని ప్రస్పుటంగా పేర్కొనవలసిన బాధ్యత మీపైనే ఉంటుంది.

Professional గా మీ Experience గురించి రాయాల్సి వచ్చినప్పుడు, Reverse Chronological Order లో రాయండి. అంటే అన్నిటికంటే లేటెస్ట్ ఉద్యోగం ఏదైతే ఉందో దానిని అన్నిటికంటే పైన ఉంచాల్సి ఉంటుంది.

Resume పైభాగంలో, మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, హౌస్ అడ్రస్ లాంటివి రావాలి. మధ్యలో మీ Work Experience, Reverse chronological ఆర్డర్ లో రావాలి. ఇక చివరగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రాయాల్సి ఉంటుంది.

అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నారో, దానికి సంబంధించిన ఏ రకమైనమైన అనుభవమయినా కూడా, చిన్నదో పెద్దదో మీకు గతంలో ఉన్నట్టయితే తప్పనిసరిగా దానిని ప్రస్తావించండి.

 

Leave a comment

Your email address will not be published.